చిలికా సరస్సు
From Wikipedia, the free encyclopedia
చిలికా సరస్సు భారతదేశపు తూర్పు తీరంలో ఉన్న ఉప్పునీటి సరస్సు. ఇది దయా నది ముఖద్వారం వద్ద, ఒడిశా రాష్ట్రం లోని పూరి, ఖుర్దా, గంజాం జిల్లాల్లో విస్తరించి ఉంది. దీని విస్తీర్ణం 1,100 చ.కి.మీ. పైచిలుకు ఉంటుంది. ఇది భారతదేశంలో అతిపెద్ద తీర ప్రాంత సరస్సు. ది న్యూ కాలెడోనియన్ బారియర్ రీఫ్ [4]తరువాత, ప్రపంచం లోని అతిపెద్ద ఉప్పునీటి సరస్సుల్లో ఇది రెండవది.[5] [6] దీన్ని తాత్కాలికంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. [7]
చిలికా | |
---|---|
ప్రదేశం | ఒడిశా |
అక్షాంశ,రేఖాంశాలు | 19°43′N 85°19′E |
సరస్సు రకం | ఉప్పు నీటి |
సరస్సులోకి ప్రవాహం | 52 ప్రవాహాలు - భార్గవి నది, దయా నది, మకర, మలగుని నది, లూనా నది[1] |
వెలుపలికి ప్రవాహం | అరఖాకుడా వద్ద ఉన్న పాత ముఖద్వారం, శతపడా వద్ద కొత్త ముఖద్వారం - బంగాళాఖాతం లోకి |
పరీవాహక విస్తీర్ణం | 3,560 km2 (1,370 sq mi) |
ప్రవహించే దేశాలు | భారత దేశం |
గరిష్ట పొడవు | 64.3 km (40.0 mi) |
ఉపరితల వైశాల్యం | min.: 900 km2 (347 sq mi) max.: 1,165 km2 (450 sq mi) |
గరిష్ట లోతు | 4.2 m (13.8 ft) |
నీటి ఘనపరిమాణం | 4 km3 (3,200,000 acre⋅ft) |
ఉపరితల ఎత్తు | 0 – 2 m (6.6 ft) |
Islands | 223 km2 (86 sq mi): బడాకుడ, బ్రేక్ఫాస్ట్, హనీమూన్, కాళిజాయ్ కొండ, బర్డ్స్ ద్వీపం, కాంతాపంథా, కృష్ణపసాద్ రాహ్ (పాత పారికుడ), నలబానా, నౌపాడ, సొమోలో, సనాకుడ. |
ప్రాంతాలు | పూరి, శతపాద |
మూలాలు | [1][2] |
Ramsar Wetland | |
గుర్తించిన తేదీ | 1 October 1981 |
రిఫరెన్సు సంఖ్య. | 229[3] |
వలస పక్షులకు భారత ఉపఖండంలో చిలికా అతిపెద్ద శీతాకాల స్థావరం. అంతరించి పోతున్న అనేక జాతుల మొక్కలు, జంతువులకు ఈ సరస్సు నిలయం. [8] [9]
ఈ సరస్సు, పెద్ద ఎత్తున మత్స్య వనరులతో కూడుకుని ఉన్న పర్యావరణ వ్యవస్థ. దీని తీరం లోను, ద్వీపాల్లోనూ ఉన్న 132 గ్రామాల లోని 1,50,000 పైచిలుకు మత్స్యకారులకు ఇది జీవిక నిస్తోంది. [10] [11]
వలస కాలంలో గరిష్ఠంగా 160 కి పైగా జాతుల పక్షులు ఈ సరస్సులోకి చేరతాయి. కాస్పియన్ సముద్రం, బైకాల్ సరస్సు, అరల్ సీ ల నుండి,రష్యాలోని ఇతర మారుమూల ప్రాంతాల నుండీ, కజాకస్తాన్ కిర్గిజ్ స్టెప్పీలు, మధ్య, ఆగ్నేయాసియాల నుండి, లడఖ్, హిమాలయాల నుండీ పక్షులు ఇక్కడికి వలస వస్తాయి. ఈ పక్షులు చాలా దూరం ప్రయాణిస్తాయి; ఇవి సూటిగా సరళ రేఖల మార్గాల్లో కాకుండా, చుట్టు తిరుగుడు మార్గాల్లో ప్రయాణిస్తాయి. కొన్ని పక్షులు దాదాపు 12,000 కి.మీ. వరకు ప్రయాణిస్తాయి.
1981 లో రామ్సార్ కన్వెన్షన్ కింద చిలికా సరస్సును అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలగా నిశ్చయించారు. భారతదేశంలో అలా గుర్తించిన స్థలాల్లో ఇదే మొదటిది [12] [13]
ఒక సర్వే ప్రకారం, ఇక్కడున్న పక్షుల్లో 45 శాతం నేలపై ఉండేవి, 32 శాతం నీటిపక్షులు, 23 శాతం ఒడ్డున నీటిలో నడుస్తూ వేటాడే తీరపక్షులు. సరస్సులో 14 రకాల వేటాడే పక్షులు కూడా ఉన్నాయి. సుమారు 152 అరుదైనవీ, అంతరించిపోతున్నవీ ఐన ఇరావడీ డాల్ఫిన్లు కూడా ఉన్నాయి. వీటికి తోడు, సరస్సులో 37 రకాల సరీసృపాలు, ఉభయచరాలు కూడా ఉన్నాయి. [14]
చిలికా పర్యావరణ వ్యవస్థలో ఉన్న గొప్ప మత్స్య సంపద సరస్సులోను, దాని సమీపంలోనూ నివసించే చాలా మంది మత్స్యకారులకు జీవనోపాధి కలిగిస్తోంది. సరస్సులో నీటి విస్తీర్ణం వర్షాకాలంలో 1165 కిమీ2,, వేసవిలో 906 కిమీ2 ఉంటుంది. 32 కిలోమీటర్ల పొడవైన, సన్నటి, కాలువ సరస్సును బంగాళాఖాతంతో కలుపుతుంది. ఇటీవల, చిలికా డెవలప్మెంట్ ఏజన్సీ ఒక కొత్త ముఖద్వారాన్ని తెరవడంతో సరస్సుకు కొత్త జీవితాన్నిచ్చింది.
చిలికా సరస్సు లోని ఉప్పునీటిలో మైక్రోఅల్గే, సముద్ర పాచి, సముద్రపు గడ్డి, చేపలు, పీతలు వర్ధిల్లుతాయి. ముఖ్యంగా ఇటీవలి సంవత్సరాలలో సముద్రపు గడ్డి పునరుద్ధరణ పొందింది. దీనితో, చివరికి అంతరించిపోతున్న దుగోంగ్లు తిరిగి నిలదొక్కుకునే అవకాశం ఉంది. [15]